మునుపటి నా మాట
అమితాబ్ బచ్చన్ కి ‘కడుపులో నొప్పి’ అని వినగానే అఖిల భారత ‘అయ్యయ్యో అలాగా?’ సంఘం వారంతా హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు ముంబైలో. రజనీకాంత్ కి ఒంట్లో బావులేక సింగపూర్ వెళ్ళారని తెలియగానే అఖిల దక్షిణ భారత ‘అరరే అవునా’ సంఘం వారంతా ఎదురు తెన్నులు చూస్తూ గడిపారు చెన్నైలో. చెరొక సముద్రం పక్కనున్న ఈ రెండు చోట్లా ఎప్పుడూ ఇంతేనేమో! కావాలంటే సహకారం, కోరుకుంటే సానుభూతి సెలబ్రిటీ లకి లభిస్తాయి అక్కడ. ఆవిడ ఎందరికో తన సహకారం అందించింది. అటువంటి ఆవిడకి సంఘాల సానుభూతి లేదు. పోనీ ఆవిడ మొక్కూ మొహం తెలియని పాత నటి కాబోలు అని చేతులు దులిపేసుకోవడానికి వీల్లేదే! దిక్కూ మొక్కూ లేకుండా పడి ఉన్న అనాధ నటి కాబోలు అని పొరబడడానికి వీల్లేదే! మరి ఆవిడని సినీ పరిశ్రమ ఎందుకనీ పట్టించుకోలేదు? శ్రమ అనుకోకుండా ఒక్కసారైనా ఒక్కరైనా ముంబై నుంచి పూణే వచ్చి ఆమెని పలకరించి వెళ్ళలేదేం? దూరాభారమా? నవ్వుతారు పసివారు ఇది వింటే. ఇప్పుడు శ్రమ పడి వస్తారు. కాని ఏం ప్రయోజనం? ఎందుకంటే ఆమె కన్నెత్తి చూడలేదు, చిరునవ్వి పలకరించలేదు. అసలు భౌతికంగా ఆమె ఉంటే కదా.. ఏప్రిల్ 29 ఆదివారం రాత్రి అచలమైన ధైర్యంతో నిజంగానే మృత్యువుతో పోరాడి, ఇక వల్ల కాదని ఏ దేవ్ లోకం పిలుపో అందుకుందామె. ఆమె పేరు అచలా సచ్ దేవ్! ఆమె డబ్భై ఏళ్ళు హిందీ సినిమాల్లో ‘అమ్మ’ పాత్ర పోషించింది. దేవానంద్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ -----ఇందరికి ఆవిడే అమ్మ. మీనాకుమారి కి ఒకసారి అమ్మ, మరొకసారి అత్త. లక్ష్మికి అత్తే. కొందరికి వదిన. మరికొందరికి అక్క. మనకి కొన్నాళ్ళు కన్నాంబ, మరి కొన్నాళ్ళు అంజలీదేవి ఎలాగో హిందీ వారికి తరతరాలకూ ఆమె అలాగ. ఆ అమ్మ ని బాల్రాజ్ సహానీ ‘యే మేరీ జొహర జబీన్’ అని పొగుడుతుంటే సిగ్గుల మొగ్గ అవ్వడం గుర్తుందా? తన సిగ్గు మొహాన్ని చేతులతో కప్పేయలేదు ఆమె. ఎందుకంటే రెండు చేతులూ డోలు వాయిస్తున్నాయి అతని పాటకి. మొహం చాటుచేసుకుంటే నటన తెలిసేదెలా? మరి అటువంటి నటీమణి కడపటి రోజుల్లో ఉందని కొన్ని నెలలుగా తెలిసినా ఆమెనెరిగిన నటీనటులు మొహం చాటు చేసుకున్నారేం?
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|